Formulário de pesquisa

మత్తయి 21

యేసు తనను బహిరంగంగా రాజుగా ప్రకటించుకోవడం (జెకర్యా 9:9. మార్కు 11:1-10. లూకా 19:29-38. యోహాను 12:12-19)

1వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి, 2“మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. 3ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు” అని చెప్పి వారిని పంపించాడు. 4దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే,

5“ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.”

6అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 7వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు. 8జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు.

9జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, “దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం” అని కేకలు వేస్తూ వచ్చారు. 10ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, “ఎవరీయన?” అని కలవరంతో నిండిపోయింది. 11ఆయనతో వచ్చిన జనసమూహం, “ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త” అని వారికి జవాబిచ్చారు.

ఆలయం శుద్ధి చేయడం (మార్కు 11:15-18. లూకా 19:45-47. యోహాను 2:13-16)

12యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు. 13వారితో ఇలా అన్నాడు, “ ‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు.”

14అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు. 15ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. 16“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని వారితో చెప్పి 17ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు.

నిష్ఫలమైన అంజూరు చెట్టును శపించడం (మార్కు 11:12-14. 20-24)

18తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. 20అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు.

21అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. 22మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు.

యేసుకు ఉన్న అధికారాన్ని మతపెద్దలు ప్రశ్నించడం (మార్కు 11:27-33. లూకా 20:1-8)

23ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు. 24యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. 25యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు.

అప్పుడు వారు, ‘మనం పరలోకం నుండి’ అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అని అంటాడు. 26‘మనుషుల నుండి’ అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకొని, 27“మాకు తెలియదు“ అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను“ అన్నాడు.

ఇద్దరు కొడుకుల కథ

28ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు. 29అతడు, ‘నేను వెళ్ళను’ అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకొని వెళ్ళాడు.

30అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు. 31ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. 32యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు, అతనిని నమ్మలేదు.

ద్రాక్ష తోట యజమాని, కౌలు రైతులు (మార్కు 12:1-9. లూకా 20:9-19. యెషయా 5:1-7)

33“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. 34కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.

35ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసుల్ని పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు.

37చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు. 38అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు. 39వారు అతణ్ణి పట్టుకొని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు. 40ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతుల్ని ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు. 41వారు “అతడు ఆ దుర్మార్గుల్ని నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు.

42అప్పుడు యేసు వారితో,

“ ‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది.

దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’

అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?

43“కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను. 44ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు.

45ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు. 46వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.

తెలుగు బైబిల్

© 2017 Bridge Connectivity Solutions. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0

More Info | Version Index